పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0014-2 నాదరామక్రియ సం: 05-080

పల్లవి:

చెలియకు విరహపు వేదన సేయని సింగారంబిది
సొలవకు వలపుల ముద్రల చొప్పులు మాపకుఁడీ

చ. 1:

కిక్కిరిసిన చనుగుబ్బలు గీఁటిన బగిలెడి నయ్యో
పక్కనఁ గనుకలి దాఁకీ బయ్యెద దెరవకుఁడీ
వెక్కసమగు ముఖకాంతికి వెడవెడ మరుఁగై తోఁచెడి
చెక్కుల చెమటలు గందెడి చేతులు వెట్టకుఁడీ

చ. 2:

అంగన మేనికిఁ బులకలు అడ్డము దోఁచెడి నయ్యో
బంగరు మొలకలవంటివి పైపైఁ దుడువకుఁడీ
తొంగలి రెప్పల కెలఁకుల తొరిగెడి కన్నుల మెరుఁగుల
ముంగిటవేసిన చూపుల మురిపెము మానుపుఁడీ

చ. 3:

తిరువేంకటపతినింతికి దెచ్చెదమనఁగా నయ్యో
కరుణించినవాఁడాతఁడె కళవళమందకుఁడీ
తరుణీమణి మా దేవునిఁ దగఁ గౌఁగిట సౌఖ్యంబులు
పరవశమందినదేమో పలుమరుఁ బిలువకుఁడీ