పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0014-1 శ్రీరాగం సం: 05-079

పల్లవి:

విరహమొ సంభోగంబుల వెడుక శృంగారమొ యిది
సరసిజముఖిఁగని ప్రాణము జల్లనఁ గలఁగెడిసే

చ. 1:

కుటిలాలకి మైఁబూసిన కుంకుమగంధపు రసములు
చిటిపొటి చెమటలఁ బెనఁగొని చిప్పిలి రాలఁగను
విటరాయని యలరమ్ములు వీఁపున వెడలఁగ నాఁటిన
తొట తొటఁ దొరిగిన నెత్తురుతోఁ దులదూఁగెడినే

చ. 2:

మృగలోచన చనుఁగవపై మెత్తిన కమ్మని తావుల
మృగమదమంటినచోట్లు మెఱుఁగులు వారెడిని
చిగురాకున మరుఁడేసిన చిచ్చిరబాణంబులచే
ఎగసిన పొగలై తోఁచీ నేమని చెప్పుదునే

చ. 3:

యోగవియోగంబులచే నొనగూడిన యీ చెలియకు
నాగరికంబుల చేఁతలు నటనలు మీరఁగను
శ్రీగురుఁడై చెలువొందిన శ్రీవేంకటగిరి నిలయుని
భోగించిన పరిణామపు పొందులు దెలిపెడినే