పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0013-3 ఆహిరి సం: 05-076

పల్లవి:

మచ్చికల మొగసిరి మందులాఁడ నీ-
కిచ్చిన దేహమిది యెట్టయినఁ జేయరా

చ. 1:

ఓడక యెక్కడనైన నుండి నీవు
వేడుకతో మాయింటికి విచ్చేయఁగాను
వాడుమోముఁ జూచి నవ్వువచ్చుఁ గాని కోప-
మేడఁ దెచ్చుకొన్నరాదు యెట్టైనాఁ జేయరా

చ. 2:

ఎంతవొద్దు వోయియైనా యిటునీవు
వింతలేక మాయింటికి విచ్చేయఁగాను
చింతతో నీ కెదురు చూచితి గాని
యెంతైనాఁ బాయలేను యెట్టయినాఁ జేయరా

చ. 3:

కుంకుమచెక్కుల మెఱుఁగులతోడ తిరు-
వేంకటేశ మాయింటికి విచ్చేయఁగాను
వంకటాడి నినుఁ గూడవలెఁగాని
యింక నిన్నుఁ బాయలేను యెట్టయినాఁ జేయరా