పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0013-2 ముఖారి సం: 05-075

పల్లవి:

పొదలు నీ సొబగెల్ల పోదేల కొల్ల
తుదలేని నీ మేలు దొరకెఁగా నాకు

చ. 1:

ఒడలిపై నీచెమట వూరు వాడెడు చెలమ
జడియు నీ తమకంబు సంత తగరు
కడగంటి నీచూపు కట్ట వదలిన క్రేపు
వడి నిన్నుఁ గరఁగింప వశమా నాకు

చ. 2:

చిఱునవ్వు నీపలుకు జిగురు చుట్టిన కండె
తెఱవలకు నీ మోవి తెరువు పెసరు
పఱచు నీనునుఁజేఁత బట్టబాయిటి యీఁత
తఱి నిన్నుఁ బైకొనఁగ దరమా నాకు

చ. 3:

చెలువంపు నీ చెలిమి చెఱకు వండిన పండు
కెలపు నీ యలుక తంగేటి జున్ను
చలివాపు నీచనవు జాజులుఁ ప్రాసాదంబు
కలిగె నీకరుణ వేంకట విభుఁడ నాకు