పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0013-1 ఆహిరి సం: 05-074

పల్లవి:

కొమ్మ తన ముత్యాల కొంగు జారఁగఁ బగటు
కుమ్మరింపచుఁ దెచ్చుకొన్నదీవలపు

చ. 1:

ఒయ్యారమున విభుని వొరపు గనుఁగొని రెప్ప
ముయ్యనేరక మహ మురిపెమునను
కయ్యంపుఁ గూటమికిఁ గాలుదువ్వుచు నెంతె
కొయ్యతనమునఁ దెచ్చుకొన్నదీవలపు

చ. 2:

పైపైనె ఆరగింపకుము పన్నీరు గడు-
తాపమవునని చెలులు దలఁకగానే
తోపు సేయుచుఁ గెంపు దొలఁకుఁ గన్నుల కొనల
కోపగింపుచుఁ దెచ్చుకొన్నదీవలపు

చ. 3:

ఎప్పుడునుఁ బతితోడ నింతేసి మేలుములు
ఒప్పదని చెలి గోర నొత్తఁగానే
యెప్పుడో తిరువేంకటేశు కౌఁగిఁట గూడి
కొప్పుగులుకుచుఁ దెచ్చుకొన్నదీవలపు