పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0012-6 దేసాళం సం: 05-073

పల్లవి:

కులుకక నడవరో కొమ్మలాలా
జలజలన రాలీని జాజులు మా యమ్మకు

చ. 1:

ఒయ్యనే మేను గదిలీ నొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీపాదతాఁకు కాంతలాలా
పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బలమీఁద
అయ్యో చెమరించె మా యమ్మకు నెన్నుదురు

చ. 2:

చల్లెడి గందవొడి మైజారీ నిలువరో
పల్లకి వట్టిన ముద్దు బణఁతులాల
మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర
గల్లనుచుఁ గంకణాలు గదలీ మాయమ్మకు

చ. 3:

జమళి ముత్యాలతోడి చమ్మాళిగ లిడరో
రమఱికి మణుల నారతులెత్తురో
అమరించి కౌగిట నలమేలుమంగనిదె
సమకూడె వేంకటేశ్వరుఁడు మాయమ్మకు