పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0012-3 శంకరాభరణం సం: 05-070

పల్లవి:

తరుణి నీ యలుకకెంతటిదింతినీ వేళఁ
గరుణించఁగదర వేంకటశై లనాథా

చ. 1:

ఒకమారు సంసారమొల్లఁ బొమ్మని తలఁచు
ఒకమారు విధిసేఁతలూహించి పొగడు
ఒకమారు తనుఁజూచి వూరకే తలవూఁచు-
నొకమారు హర్షమున నొంది మే మఱచు

చ. 2:

నిన్నుఁ జూచి వొకమారు నిలువెల్లఁ బులకించు
తన్నుఁ జూచి వొకమారు తలపోసి నగును
కన్ను దెరచి నినుఁజూచి కడు సిగ్గువడి నిలిచి
యిన్నియునుఁ దలపోసి యింతలో మఱచు

చ. 3:

వదలైన మొలనూలు గడియించు నొకమారు
చెదరిన కురులెల్లఁ జెరుగునొకమారు
అదనెరిఁగి తిరువేంకటాదీశ పొందితివి
చదురుఁడవు నినుఁ బాయఁజాలదొక మారు