పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0012-2 ఆహిరి సం: 05-069

పల్లవి:

దవ్వుల నుండవే యాల దగ్గరేవు ఆతఁ-
దెవ్వరౌతా నెఱఁగవిదేమే చెలియా

చ. 1:

ఒద్దికతో చనుదోయి నొరయుచు కంట-
నద్దలింపుచుఁ దిట్టేవు అమ్మమీఁదను
ముద్దుమోము విరియించి మురిసేవు ఇంత
వద్దువో ఆతనితో గర్వము నీకుఁ జెలియా

చ. 2:

బొమ్మముడి జంకెనలఁ బొలయుచు మోవిఁ
దమ్మచూపి సన్న సేసి తనరేవు
చిమ్మేవు నీ చెమటలు చెక్కు మీఁద ఓ-
యమ్మరో యాతనితో వొయ్యార మేలే చెలియా

చ. 3:

మొరము మెట్టెలు పాదమున మెట్టి
చెరఁగులోపల గోరఁ జెనకేవు
కరఁగి వేంకటపతి కౌఁగిట నీ-
నెరతనములు చూప నేర్తువా చెలియా