పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0011-5 పాడి సం: 05-066

పల్లవి:

సుతుని నరకునిఁ జంప జూచినాఁడవు సుమ్మీ
మతి నన్నుఁ దలచక మానిన నీకాన

చ. 1:

ఎత్తుక నితోడఁ బుట్టు హిరణ్యకశిపుని
నెత్తురు దాగితి సుమ్మీ నేఁడే రాకుంటే
ఉత్తలాన నేడనైనా నుండుదువో యని భీతి
బిత్తరముగాఁ బెట్టితి పెట్టరాని యాన

చ. 2:

కప్పుక నీ మేనమామ కంసుని ప్రాణానకు
తప్పినవాఁడవు సుమ్మీ తడసితేను
ఇప్పుడిట్టే నీవు రాని యీరసానఁ బ్రియములు
చెప్పలేక పొడిచితి చెడుగైన యాన

చ. 3:

సిరుల మేన మరఁది శిశుపాలు నీ విట్టే
పొరిగొంటివి సుమ్మీ పోయితే నీవు
తిరువేంకటేశ నన్నుఁ దివిరి కూడి వని
కరుణఁ బెట్టితి నీకుఁ గపటాన నాన