పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0011-6 శుద్ధవసంతం సం: 05-067

పల్లవి:

చాలదా యీ చనవులు
మేలపు సేఁతల నిన్ను మెచ్చించ గలిగె

చ. 1:

ఎంతటిదిరా నిన్ను విందాఁక రానీక
పంతమాడి వలపించి బాసగొన్నది
ఇంతి నోఁచినట్టి నోము యెటువంటిదో నీ
చెంతఁజేరీ నీ మంచి చెక్కు నొక్కఁగలిగె

చ. 2:

ఎవ్వతెరా నిన్ను నెలయించి తన నిండుఁ
జవ్వనము విలువిచ్చి జట్టి గొన్నది
అవ్వల దాని భాగ్యమది యెట్టిదో నీవు
పవ్వళించు పరుపుపై పవ్వళించఁ గలిగె

చ. 3:

ఎట్టిదిరా సతి నిన్ను యింటిలోన వెళ్ళనీక
పట్టుకొని కౌఁగిటిలోఁ బాయనీనిది
అట్టె నిన్ను తిరువేంకటాధీశుఁడా నీవు
దట్టించు నీ కౌఁగిటిలో తగులఁగఁ గలిగె