పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0011-3 ముఖారి సం: 05-064

పల్లవి:

కలగన్నచోటికిని గంప యెత్తిన యట్లు
అలవు మీఱినదెట్లనమ్మా

చ. 1:

ఎలయింపుఁ గడకంట నెన్నఁడో వొకనాఁడు
చెలఁగి తను నతఁడు చూచినవాఁడట
పొలిఁతి యదిదలఁచి యిప్పుడు మదనవేదనల-
నలసీ నిఁకనెట్లనమ్మా

చ. 2:

ఎఱుకయును మఱపుగా నేఁటికో వొకనాఁడు
కెఱలి తను నొవ్వఁ బలికినవాఁడట
తఱినదియె చెలి యిపుడు దలఁచి పరితాపాగ్ని-
నఱగీ నిఁకనెట్లనమ్మా

చ. 3:

ఇయ్యకోలుగఁ గలసి యెప్పుడో యిదెనేఁడు
నెయ్యమున చెలిలోన నెలకొనెనట
తియ్యముల సటకాఁడు తిరువేంకటేశ్వరుఁడు
అయ్యో యిఁకనెట్లనమ్మా