పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0009-6 సౌరాష్ట్రం సం: 05-055

పల్లవి:

ఊరులేని పొలిమేర పేరు పెంపు లేని బ్రతుకు
గారవంబు లేని ప్రియము కదియనేఁటికే

చ. 1:

ఉండరాని విరహవేదన వుండని సురతసుఖమేల
యెండలేని నాఁటి నీడ యేమిసేయనే
దండిగలుగు తమకమనెడి దండలేని తాలిమేల
రెండునొకటి గాని రచన ప్రియములేఁటికే

చ. 2:

మెచ్చులేనిచోట మంచిమేలు గలిగీనేమి సెలవు
మచ్చికలేనిచోట మంచిమాటలేఁటికే
పెచ్చు పెరుగలేనిచోట ప్రియముగలిగి యేమిఫలము
ఇచ్చలేనినాటి సొబగులేమి సేయనే

చ. 3:

బొంకులేని చెలిమిగాని పొందులేల మనసులోన
శంకలేక కదియలేని చనవులేఁటికే
కొంకుగొసరు లేని మంచికూటమలర నిట్లఁ గూడి
వేంకటాద్రివిభుఁడు లేని వేడుకేఁటికే