పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0009-5 సామంతం సం: 05-054

పల్లవి:

మదము దొలఁకెడి యట్టి మంచివయసున మనకు
తుదలేని వేడుకలు దొరకుటెన్నఁడురా

చ. 1:

ఉదుటుఁ జనుదోయి నీవురముపై దనివార-
నదిమి మోమును మోము నలమి యలమి
వదలైన నీవితో నాలుఁగన్నుల జంకెఁ
లొదవ నీ మీఁద నే నొరగుటెన్నఁడురా

చ. 2:

కలికితనమునఁ నాదు కప్పురపుఁ దమ్ములము
కులికి నీ వదనమునఁ గుమ్మరించి
పలచనగు గోళ్ళ నీ పగడవాతెర నొక్కి
చెలువమగు నునుగంటి సేయుటెన్నఁడురా

చ. 3:

గరగరని కురులతో కస్తూరివాసనలు
విరితావులతోడ విసరఁగాను
తిరువేంకటాచలాధిపుఁడ నిను గూడి నే-
నరమరచి సదమదములౌట యెన్నఁడురా