పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0009-4 మాళవశ్రీ సం: 05-053

పల్లవి:

దుప్పటెల్లా జవ్వాదినే తొప్పఁదోఁగె నీకడనే
వొప్పదా యింతేసి నీకు వో వలపా

చ. 1:

ఉత్తలపు విరహన నుడుకుచు వయసు మీఁ-
దెత్తినది సతి నీకు నిందుకొరకా
వత్తునని విచ్చేసి వనితల కుచముల
వొత్తగిలి వున్నాఁడ వోహో వలపా

చ. 2:

నిదుర గంటకి రాక నెలఁత పానుపుమీఁద-
నెదురు చూచీ నీకు నిందుకొరకా
ముదితల కౌఁగిట ముంచిన కస్తూరి నీకు
వుదిరెడి వురమున నో వలపా

చ. 3:

కన్నుల కలికి నింత కరఁగించి కవుఁగిట
ఎన్నిక సేసితివి నీ విందుకొరకా
చిన్ని చిన్న నగవుల శ్రీవేంకటేశ నీ-
వున్నాఁడవొరపులై వోహో వలపా