పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0009-3 ముఖారి సం: 05-052

పల్లవి:

వెరతుమయ్య చూపు వేఁటకాడ
తరితీపు సేసి మమ్మింతటనె యేఁచేవు

చ. 1:

ఉంటవింటఁ గప్పురాన నుబ్బి నన్ను నేసేవు
యింటి వారెవ్వరుంటా యెరఁగవు
కంటిమి నీ యదలింపు కరఁగి నేఁబై కొన్న
వెంట వెంటఁ దిరిగాడి వెతలఁ బెట్టేవు

చ. 2:

పేలరివై యేడనైనాఁ బేరుకొని పిలిచేవు
యేలిన వారెవ్వరంటా నెఱఁగవు
తాలిమి మీరఁగ నీ చిత్తములో మెలఁగఁగ
కాలూఁదనియ్యక యింత కాఁకలఁ బెట్టేవు

చ. 3:

కొప్పులోని విరులు చెక్కుల జారఁ జెనకేవు
యెప్పుడైనా నెవ్వరుంటా నెఱఁగవు
కప్పకుర చెఱఁగు వేంకటరాయ చెమటలఁ
దొప్పఁదోఁగి యెవ్వతో పొందులకు నేఁగితివి