పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0009-1 శ్రీరాగం సం: 05-050

పల్లవి:

వద్దు నీకు నాతోడి వట్టిమాటలు
ముద్దులు నీపైఁ గునిసి మురిసీఁబో యిఁకను

చ. 1:

ఈడ వచ్చి ప్రియము నాకేమి చెప్పేవిందాఁకాఁ
గూడినాకెకే ప్రియము గులుకరాదా
వాడిక నిందాఁక నీవు వచ్చిన నేరమికి
సూడుఁ బాడుఁ జెనకీఁ బో సొలపుఁ జేఁతలనే

చ. 2:

ఎదిరి నావంకఁ దప్పకేమి చూవేవిఁక నీ-
ముదితపైనే చూపులు ముంచరాదా
మెదలి నా ముంగిలిది మెట్టిన తప్పునకును
సద చేసి జగడాలు చల్లెడిఁబో యిఁకను

చ. 3:

ఇట్టు నట్టుఁ జెఱఁగు నాకేల పట్టేవిదె మున్ను
పెట్టినాకెకే చెఱఁగు పట్టరాదా
వెట్టికూటములు చాలు వేంకటేశ యిదె నిన్ను
బెట్టుగాఁగా నలుకలఁ బెట్టుఁగదా యిఁకను