పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0008-3 కాంభోది సం: 05-046

పల్లవి:

ఎప్పుడు గాని రాఁడో యెంతదడవాయ కాలి-
చప్పుడాలకించి మతి జల్లురనెనమ్మా

చ. 1:

ఇద్దరమదరిపాటు యేకాంతాన నాడుకొన్న-
సుద్దులు దలఁచిమేను చురుకనెనమ్మా
పెద్దగాఁ గస్తూరిబొట్టు పెట్టిన నాతఁడు గోర
తిద్దుట దలఁచి మేను దిగులనెనమ్మా

చ. 2:

పాయక యాతఁడూ నేనుఁ బవ్వళించే యింటివంకఁ
బోయి పోయి కడుఁ జిన్న బోతి నోయమ్మా
తోయపు గుబ్బల చన్నుదోయి మీఁద వాఁడొ త్తిన-
పాయపు జంద్రుల జూచి భ్రమసితినమ్మా

చ. 3:

కూడిన సౌఖ్యములందు కొదలేని వాని నా-
వేడుక మతి దలఁచి వెరగాయ నమ్మా
యీడులేని తిరువేంకటేశుఁడిదె నాతోడ
నాడినట్టే నాచిత్తమలరించె నమ్మా