పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0095-2 శ్రీరాగం సం: 05-379

పల్లవి:

ఇప్పుడెట్లున్నదో యిందువదన
అప్పటికిఁ గొంత గుణమాయ నావేళ

చ. 1:

తెఱవ శశికాంతవేదికమీఁద మలఁగుపై -
నొఱగి పరితాపాగ్నినుడుకఁ గాను
నెఱి దొలఁకు మోమువెన్నెలకు శశికాంతంపు -
టఱఁగు గరఁగిన శైత్యమాయెనావేళ

చ. 2:

చెలియ పొన్నల విడ చిగురుఁబానుపుమీఁద
పలుమారు నినుదూరి పాడఁగాను
చెలఁగి పొన్నల విరియు చిలుకుఁదేనెల సోనఁ
దెలివొంది కొంత వడదీరెనావేళ

చ. 3:

తొయ్యలి విలాసమున తఁగు మంచముమీఁద
పయ్యెదరజార నినుఁ బాడఁగాను
తియ్యమునఁ గూడితివి తిరువేంకటేశ్వరుఁడ
నెయ్యంపు వేడుకలు నినిచెనావేళ