పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0095-3 ఆహిరి సం: 05-380

పల్లవి:

ఎంత మన్నించితో యీ యింతినిదె నీవు
అంతకంతకుఁ బ్రేమనలరీనిపుడు

చ. 1:

పడఁతి నాట్యశ్రాంతిఁ బవళించి తొల్లి నీ-
తొడలపై నీవు తల దువ్వఁగాను
కడలేని యటువంటి కళలు దలఁచే కదా
విడువని వియోగమున వేఁగీనిపుడు

చ. 2:

ఒనరఁ గుచభారమున నొరఁగి యీ మలఁగుపై-
నెనసి నీవాకు మడిచియ్యఁగాను
వనిత నేఁడటువంటి వలపుదలఁచే కదా
ఘనమైన తాపమునఁ గాఁగీనిపుడు

చ. 3:

సిరులు నీ మోముపైఁ జెక్కు లొయ్యన చేర్చి
యరమోడ్చి కనురెప్పలలమి యలమి
తిరువేంకటాచలాధిపుఁడ నినుఁ గూడియే
పరవశానంద సంపదఁ దేలెనిపుడు