పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0006-6 సామంతం సం: 05-037

పల్లవి:

చెదరి తిట్టు పుణుఁగు చెక్కులఁ గరిగి జార
సుదతి నెచ్చెలి మీఁద సోలగిలినది వో

చ. 1:

ఇంతివీఁపు నిమ్మపంట నేమరించి తాఁకవేసి
మంతన మెవ్వరితోనో మాటలాడేవు
అంతలోనే కళదాఁకి అకె మేను జల్లనఁగ
చింతతోనే మోమువంచి సిగ్గువడినదివో

చ. 2:

పొలతిఁగుబ్బలు నొవ్వఁబూవులచెండున వేసి
కలికతనమున మరలి చూచేవు
కలకంటి యింతలోనే కంతునిబాణమునవి
పలుకనేరక మానుపడి వున్నదదివో

చ. 3:

పొక్కెడిచెలిఁ బన్నీటి పొట్లానఁ దాఁకవేసి
తక్కరి నవ్వులతోడఁ దలవంచేవు
గక్కన నేఁడతివ వేంకటరాయ నినుఁగూడి
వెక్కసపు మఱపతో వెరగందినదివో