పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0094-4 ముఖారి సం: 05-377

పల్లవి:

కందువ నేఁడెందరైనాఁ గలరు నీకు
యిందరిలో నాప్రియమీడేరీనా

చ. 1:

సన్నలు సేసేటి వారు సరసమాడేటివారు
కన్నుల మొక్కేటివారు గలరు నీకు
విన్ననై యిందరికిని వెరవనే కాక నాఁ
విన్నపమెంతైన నీకు వినఁదీరీనా

చ. 2:

తేఁకువఁ జేరేటివారు తేనెల మాఁటలవారు
కాఁకలు సేసేటివారు గలరు నీకు
యేఁకటనిందరికడ నెడతాఁకనేకాక
సోఁకనాడే నావంక చూడఁగూడీనా

చ. 3:

ముద్దులు గునియువారు ముచ్చటలాడెడివారు
గద్దించి తిట్టెడివారు గలరు నీకు
తిద్దిన నీవిద్యలివి తిరువేంకటేశ నా-
వొద్దఁ గూడి యిట్ల నీకు వుండఁగూడీనా