పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0093-5 శుద్ధదేశి సం: 05-372

పల్లవి:

మొలనూలి గొల్లెత మురియుచును
వలవంతఁ దిరిగీని వాడవాడలను

చ. 1:

సంపెఁగలతురుముతో చల్లలమ్మీనిదివొ
పంపుమోము గొల్లెత వాడలను
యింపులకోరికె తో నిందిరాపతి యెదుట
జంపుల నటనలతో సాళగింపుచును

చ. 2:

నొసలికస్తూరితోఁ గన్నుల నవ్వీనిదివో
పసివాడు గొల్లెత వాడలను
కసరుచు హరిమీఁదికాఁకల కోపముతో
యెసరుఁ జెమట గోర యెమ్మెలఁ జిమ్ముచును

చ. 3:

చెలువంపుటుంగరాల చెయి వీచీనిదివో
వలపుల గొల్లెత వాడలను
కలికియై తిరువేంకటవిభుకౌఁగిట
అలసిన నటనల నల్లంతనేఁగుచును