పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0091-5 అమరసింధు సం: 05-360

పల్లవి:

తలఁచిన దేహము నిలువదు తాననుఁ దలఁచునో తలఁచఁడొ
వలనుగఁ జెలిమాటలు విని వచ్చీనో రాఁడో

చ. 1:

శిరసున నంటిన పునుఁగిటు చెక్కుల జారెడిననుచును
ఉరవడిఁ దివియుచుఁ గొనగోరూఁదిన చందములు
మురిపెపు మొలనూళ్ళపై మొగపుల సొబగులు చూచుచు-
నరుదుగ గరమున నక్కడ నంటెడి యాసలును

చ. 2:

చెనకుల వీడెపురసమిదె సెలవులఁ జెదరెడిననుచును
నునుపగు గోళ్ళ వాతెర నొక్కినచందములు
పెనగొను ముత్యపుసరముల పెక్కువ దీర్చెదననుచును
చనవునఁ జనుఁగవపై జే చాఁచిన చందములు

చ. 3:

వుద్దపు నడపులలోపల నొయ్యన పాదము జారిన-
నొద్దికతో నునుఁగౌఁగిట నొరసిన చందములు
నిద్దపుఁ దిరువేంకటగిరినిలయుఁడు ననుఁ దనకౌఁగిట-
నద్దిన కస్తూరిచెమటల నలమిన చందములు