పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0091-4 ముఖారి సం: 05-359

పల్లవి:

మాటలు నేరుతువుగా మాయమ్మా
యేఁటికి నాతని నీవే యేలవమ్మా

చ. 1:

చేయరాని విన్నపాలు నేసిసేసి విభునింత
మాయలఁబెట్టితివి గా మాయమ్మా
రాయడించి యిఁకను నారాజ్యమెల్ల నీవే
నేయవమ్మా నేనేమి సేసేనమ్మా

చ. 2:

ఎందును నీకతఁడు నోరెత్తకుండ మంత్రాలు
మందులు నేరుతువుగా మాయమ్మా
చెందరాని సుఖమెల్లఁ జెలఁగి యాతఁడు నీవే
చెందవమ్మా నాకేల చిన్నదానికమ్మా

చ. 3:

వన్నెల వేంకటపతి వలఁబెట్టి యతనిచే
మన్ననఁ బొందితిగా మాయమ్మా
నన్నుఁజూడుమిఁకను నీ ననిచిన యతని నే
సన్నలఁ జిక్కించుకొంటిఁ జాలదా నాకమ్మా