పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0090-4 కేదారగౌళ సం: 05-353

పల్లవి:

సువ్వి సువ్వి సువ్వని
సుదతులు దంచెదరోలాల

చ. 1:

వనితల మననులు కుందెన చేసిటు
వలపులు తగ నించో లాల
కనుసన్నలనెడు రోఁకండ్లను
కన్నెలు దంచెదరోలాల

చ. 2:

బంగారు చెరఁగుల పట్టుపుట్టముల-
కొంగులు దూలఁగనోలాల
అంగనలందరు నతివేడుకతో
సంగడి దంచెదరోలాల

చ. 3:

కురులు దూలఁగ మంచి గుబ్బచన్నులపై
సరులు దూలాడఁగ నోలాల
అరవిరి బాగుల నతివలు ముద్దులు
గురియుచు దంచెదరోలాల

చ. 4:

ఘల్లు ఘల్లుమని కంకణరవములు
పల్లవ పాణులకోలాల
అల్లన నడుములు అసియాడుచు సతు-
లొల్లనె దంచెదరోలాల

చ. 5:

కప్పుర గందులు కమ్మని పువ్వుల-
చప్పరములలో నోలాల
తెప్పలుగా రతిఁ దేలుచుఁ గోనే-
టప్పనిఁ బాడెదరోలాల