పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0090-1 ముఖారి సం: 05-350

పల్లవి:

కొండల గుబ్బల నాతో గోరాదిగొనేవు
కొండల నావులఁగాచిన కోడెకాఁడఁ గాన

చ. 1:

వంకలకురులదాన వద్దు నే నీకు మూఁడు-
వంకలవెంటఁ దిరిగేవాఁడఁ గాన
సంకుమెడదాన నీతో సరివచ్చేనా
సంకుచేతి నన్ను నీవు జట్టిగొంటి చాలదా

చ. 2:

యేనుఁగు నడుపుదాన నేల నే నీకు తొల్లి
యేనుఁగుఁ గాచినవాఁడ యేనుఁగాన
మీనుకవగంటిదాన మెచ్చేవా నన్ను మేటిఁ
మీననై జలదిలో మెరసినవాఁడను

చ. 3:

చీఁకటితురుముదాన చేరకు నన్ను
చీఁకటి నల్లనిమేని చెలువుఁడను
వేఁకపుఁ బిరుఁదుమీఁద వేయకు చెయి
వేఁకమైన భూమిమోఁచే వేంకటవిభుఁడను