పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0006-3 వరాళి సం: 05-034

పల్లవి:

తలఁచి వేరొకటాడఁ దడఁబడీని
మలసిన నీ కేల నోర మాట వెళ్ళీనే

చ. 1:

ఇంచుకంత నెరసున్నానేఁచిన రెప్పలవెంట
నించి నించి కన్నులలో నీళ్ళుగారీని
యెంచరాని నీకన్నులెదుట నాతఁడుండఁగాను
యెంచిన నిదుర నీకు నేల వచ్చీనే

చ. 2:

ఎక్కువభారము మేననించుకంత దోఁచినాను
తక్కరి యీ దేహమెల్లాఁ దల్లడించీనే
మక్కువ నీ విభుఁడు నీమతినిండి వుండఁగాను
వెక్కసాన నేరీతి వేగించేవే

చ. 3:

వెలయగఁ గోపమొకవీసమంత దోఁచినాను
కలిగిన ముదమెల్లా గాలిఁబోయీని
కలిసితినిదె వేంకటపతి నాతని-
నెలయింత తమకాన నేడ దాఁగేవే