పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0089-5 ఆహిరి సం: 05-348

పల్లవి:

ఉవిదతనులత యేఁటికులికి పడెనే
కవ మదనబాణాగ్నిఁ గాఁగదుగదా

చ. 1:

వనితలావణ్యంపు వదనశశికలములు
చనుగిరులపై నేల జారివడెనే
వెనకఁ దురమను రాహు వేవేలు రూపులై
తనర ముఖచందురుఁడు తలకఁడుగదా

చ. 2:

మొలకలై గుమురులై ముదితమై మరునంప-
ములుకులంతటనేల ముణుఁగఁబడెనే
పొలయు మరునస్త్రమటు పుంఖానుపుంఖములు
పొలఁతిమీఁదనె రాశివోయఁడు గదా

చ. 3:

కొమరైన పెనుదండు కుసుమాయుధుఁడు గదలి
తెమలి రాకిపుడెట్లఁ దిరుగఁబడెనే
విమలాంగికౌఁగిటను వేంకటేశ్వరునిఁ గని
భ్రమసి ప్రతిదండనుచు పదరఁడుగదా