పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0089-4 ఆహిరి సం: 05-347

పల్లవి:

పచ్చిదేరే వలపు బయలువెరపు
నచ్చుగోరి నాటు కిన్నరి తంత్రి మీటు

చ. 1:

వెలయఁ జల్లనిగాలి విరులెదిర్చిన జాలి
తలఁప పూధూళి చిత్తజు వయ్యాళి
కలయ వెన్నెల వెలుఁగు కాలకూటపు నలుఁగు
పలుకుఁ దేనెలచిందు బడబాగ్నివిందు

చ. 2:

అగడు గోవిలకూఁత అంగన నొసలివ్రాఁత
నిగనిగని పన్నీరు నిప్పులయేరు
సొగసుచాలనిచోటు చురుకుటలుగుల పోటు
నగవుఁ జిలుకల నుడుగు నమ్మించు పిడుగు

చ. 3:

తనివోని రతికాఁక తప్పుసేయని యాఁక
వనితకీపతిమాట వలపుమూట
వినయంపు రతికింపు వేంకటేశ్వరు సొంపు
తనువుమెత్తనిపరపు తనువెల్లమరపు