పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0089-1 శ్రీరాగం సం: 05-344

పల్లవి:

అటు గొంతకాలంబులనుభవించఁగఁ గలిగె
యిటు గొంతకాలంబు యివి చూడవలనె

చ. 1:

వెన్నెలలుఁ జీఁకట్లు వెలఁది సుఖదుఃఖములు
కన్నుదెరచి మూయుటలు గతులు నవగతులు
మన్ననలు వొల్లములు మగువ పగలును రేయి
తన్నుఁదానె సమకూడుఁ దనుఁదానె తొలఁగు

చ. 2:

కిందు మీఁదైవచ్చుఁ గినుకలును దాలిములు
ముందు వెనకగుఁ జెలియ మోదఖేదములు
పొందికలు పాయుటలు పొలఁతి సౌభాగ్యములు
ఇందరికి సరిగాఁగ నెదురెదురనుండు

చ. 3:

మరచినను తలఁచినను మనసు తనపైనుండు-
టెరుఁగునది తిరువేంకటేశ్వరుండు
తెరవనిదె కరుణించె దేవుఁడే నాయకుఁడు
తరితీపుసేయుఁ గాని తలఁపులోనుండు