పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0088-5 వరాళి సం: 05-342

పల్లవి:

నిలు నిలు దగ్గరకు నీ యాన నీకు
వలచితినని మావారెల్ల నగరా

చ. 1:

వద్దు వద్దు కొండలలోవారికి మాకింతేసి
పెద్దపెద్ద ముత్యాలుపేరులిన్నేసి
అద్దము చూచిదె నాకు నంతకంటె సిగ్గయ్యీని
గద్దరి మాచెంచువారు గని నిన్ను నగరా

చ. 2:

చాలుఁజాలు బంగారు సరుపణు లుంగరాలు
నీలపుఁగంట సరులు నీకే వుండనీ
మూలనుండేవారు గాక ముత్యాలచెరఁగుల-
చేలగట్టుకొన్న నన్ను చెంచెతలు నగరా

చ. 3:

రాకురాకు యీడకు నీ రమణుల పాదమాన
నాకు నీకు నింతేసి ననుపేఁటికి
దీకొని కూడితి నన్ను తిరువేంకటేశ యీ-
కాకరిచేఁతలకు లోకమువారు నగరా