పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0088-3 రామక్రియ సం: 05-340

పల్లవి:

తమకమును దలపోఁతయును గలదెందాఁక
అమరుఁ జెలువము దనకు నందాకఁ దరుణి

చ. 1:

విరసంపు మరునిపై వెరపు మతికెందాఁక
ఆరయఁ దనయాపదయు నందాఁక
సిరిదొలఁకు జవ్వనపు సిగ్గు నీకెందాఁక
అరవిరి విలాసంబునందాఁకఁ దరుణి

చ. 2:

ఎనయు ముదములును దనయేతులును నెందాఁక
అనుఁగుఁ గోరికలు దనకందాఁక
కనుఁగొనల నవ్వులును కాఁకలును నెందాఁక
అనవరతసుఖము దనకందాఁకఁ దరుణి

చ. 3:

తలఁపు వేంకటవిభుని తగులు గలదెందాఁక
అలరుఁదెలుపులు మతులునందాఁక
కలయునాతని చనవు కరుణగలదెందాఁక
అలవోక పరిణతలునందాఁకఁ దరుణి