పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0088-2 కన్నడగౌళ సం: 05-339

పల్లవి:

తరుణికనుఁగవ మోడ్పు తగఁ జూడరే
వరునిఁ దనమతి సొలసి వడిఁ జూచినట్లు

చ. 1:

వెలఁది ముక్కున వెడలు వేఁడి నిట్టూరుపుల -
చెలువమెటువలెనుండెఁ జెప్ప-గదరే
చలముకొను నలులకును సంపంగి పెనుగాలి
కలకంటిమేనికిని కాపిడినయట్లు

చ. 2:

పడతిపైనునుఁ జెమట పన్నీటితావితో
బడిబడినె యెట్లుండె భావింపరే
అడరు విరహానలంబప్పటప్పటికార్చ
కడువేగముదకముడుగక చల్లి నట్లు

చ. 3:

ఇంతినెన్నుదుటిపై నిపుడు చెదరిన కురులు
వింతలై యెట్లుండె వివరించరే
సంతమై వేంకటేశ్వరుఁడు చెలినేఁపు శశి-
సంతముడుపఁగఁ దమము పరె విడిచినట్లు