పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0087-6 సామంతం సం: 05-337

పల్లవి:

ఎవ్వరికిఁ జెల్లునమ్మ యింతేసి పనులు
నొవ్వని నొప్పులతోడ నొగిలీఁ జెలియ

చ. 1:

వీఁగెడి తురుముతోడ వేఁకపు సొమ్ములతోడ
కాఁగిన దేహముమీఁది కస్తూరితోడ
ఆఁగిన యాసలతోడ నతిరాజసముతోడ
వేఁగెడిఁ బ్రాణేశుఁబాసి విరహనఁ జెలియ

చ. 2:

విప్పని రెప్పలతోడ వేఁడిచెమటల తోడ
పుప్పొడి దాఁకినమేని పొక్కులతోడ
కప్పక కప్పిన మంచి కలికిపయ్యెదతోడ
కప్పురపుటూర్పులఁ గరఁగీఁ జెలియ

చ. 3:

భావపువింతలతోడ పచ్చిసింగారముతోడ
ఆవులు వారెడిమేని అలపులతోడ
శ్రీ వేంకటేశ్వరుఁగూడి సిగ్గులగర్వముతోడ
ఆవలిమోమై మాఁటలాడీఁ జెలియ