పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0087-5 దేశాక్షి సం: 05-336

పల్లవి:

ఎప్పుడు వచ్చునో యంటా నెదురు చూచీఁ బతికి
దప్పిదేరు మోముతోడ దాఁచలేదు ప్రియము

చ. 1:

వేఁటవోయిన మగఁడు వీధి రాఁగాఁ గిన్నెర
మీఁటుచుఁదా నిక్కిచూచి మేడపైనుండి
గాఁటపు గుబ్బలకొంగు గప్పదు జారిన నింత-
అఁటది వలచెనేని ఆఁపరాదు ప్రియము

చ. 2:

ఇంతి చూడఁగానె విభుఁడేతుల గుఱ్ఱము దోలి
చెంతనున్న సతులెల్ల చేతఁజూపఁగా
అంతలోనె యాకె తనువంతయుఁ బులకించె
పంతపుసతులకైనఁ బట్టరాదు ప్రియము

చ. 3:

తేఁకువ మెరసి రాఁగా తిరువేంకటేశుఁ జూచి
వేఁకపుఁదురుముతోడ విఱ్ఱవీఁగీని
కాఁకతోడఁ జిత్తమెల్లఁ గరఁగి నీరై మించె
యేఁకట నెవ్వరికైన నెంతగాదు ప్రియము