పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0087-4 మాళవిఁగౌళ సం: 05-335

పల్లవి:

చాఁచిన చలముల సటకాఁడ యిట్టె
వేఁచితివిపుడు నీవే కావోరి

చ. 1:

విరులు గోయఁగ నన్ను వేడుకతోఁ జూచి
విరులెంత ప్రియమొ యీ వెలఁదికని
మరుని తియ్యని వింటి మాయపుఁ గ్రొవ్వాఁడి
విరులేయించితివి నీవేకావోరి

చ. 2:

జలము గేళాకూళిఁ జల్లులాడఁగఁ జూచి
జలమెంత ప్రియమొ యీ సతికినని
చెలఁగి కాఁక చెమట చెలమ నాపై సేఁడు
వెలయఁ జేసితివి నీవే కావోరి

చ. 3:

తొడవులిడుచు నేను తొంగలించఁగఁ జూచి
తొడవులే ప్రియము యీ తొయ్యలికని
కడుఁదొడవులే వేంకటరాయ కొనగోర
విడువకిచ్చితివి నీవే కావోరి