పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0087-1 ముఖారి సం: 05-332

పల్లవి:

చాలుఁ జాలు నీ జాజర నన్ను
జాలిఁ బరచె నీ జాజర

చ. 1:

వలపు వేదనల వాడేను యీ-
తలనొప్పులచేఁ దలఁకేను
పులకలమేనితోఁ బొరలేను కడుఁ-
జలిగొని చల్లకు జాజర

చ. 2:

ఒల్లని నినుఁగని వుడికేను నీ-
చిల్లరచేఁతలఁ జిమిడేను
కల్లగందవొడిఁ గాఁగేను పైఁ
జల్లకు చల్లకు జాజర

చ. 3:

తివిరి వేంకటాదిప నేను నీ-
కవుఁగిటికబ్బితిఁ గడు నేను
రవరవ చెమటఁ గరఁగి నేఁడు యిదె
చవులాయను నీ జాజర