పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0085-3 తెలుఁగుఁగాంబోది సం: 05-322

పల్లవి:

చక్కఁదనములనే వేసాలఁబొయ్యేవు నీ-
యెక్కువలె యింతసేసె నెక్కడ చొచ్చేవే

చ. 1:

వెన్నెలలకునె యింత వెరచేవు నీమోము
వెన్నెలలచే నెట్టు వేఁగించేవే
సన్నపుఁ దేంట్లకిట్టె జడిసేవు నెలఁత నీ-
యిన్ని నెరిఁదుమ్మెదలకెట్ల లోఁగేవే

చ. 2:

చిలుకలకునే యింత చిమిడేవు నీ చిలుక-
పలుకుల నెక్కడికిఁ బారఁదోలేవే
చలిగాలికినె యింత జడిసేవు నెలఁత య-
గ్గలపుటూర్పుగాలికెక్కడ నొదిగేవే

చ. 3:

మదనుఁడనినను వేమారు గలఁగేవు నీ-
మదనగురునికెట్టు మనసిచ్చేవే
ఇదె వేంకటేశుఁడు నిన్నెనసి కౌఁగిటఁగూడె
పొదలుఁదావులకెట్టు పొంగుచుఁ జొక్కేవె