పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0085-1 సామంతం సం: 05-320

పల్లవి:

పడఁతి నినుఁదలచి పో పలుకఁడతఁడు, నీ-
వెడసినను బ్రాణంబులెరవులాతనికి

చ. 1:

వెదచల్లు నీ మోమువెన్నెలలఁ దలఁచిపో
పొదలు వెన్నెలబయటఁ బొలయఁడతఁడు
ముదిత నీ నెరులు దురుమును దలఁచిపో యతఁడు
కొదమతేంట్ల గనిన గుండె జల్లనును

చ. 2:

లలితాంగి నీ దేహలత దలఁచి పో యిపుడు
చెలఁగి వనమునకు విచ్చేయఁడతఁడు
వెలఁది నీమోవికావిరి దలఁచి పో యతఁడు
తలిరాకు గని గుండె తల్లడంబౌను

చ. 3:

కోమలిరో నీ యిట్ల కూటములు దలఁచిపో
ప్రేమమితరములపైఁ బెట్టఁడతఁడు
దీమసపు వేంకటాధిపుఁడుగన యాతనికి
సామాన్యసరసతలు సరుకుగావరయ