పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0082-5 ఆహిరి సం: 05-305

పల్లవి:

జవ్వనంపుమదమున జడిసేటి తరుణి
పువ్వుల పానుపమీఁదఁ బొరలీఁ జూడరే

చ. 1:

ముత్తేలకంకణాల మురిసేటి కరము
చిత్తగించు చెలి నేఁడు చెక్కుమీఁదను
కొత్తనెత్తావి విరుల కొమరైన తురుము
వత్తుల నెరులతోడ వదలీఁ జూడరే

చ. 2:

పయ్యెదవెలి మించు పగటైన గుబ్బలు
ముయ్యరాని పెనుతాపమునఁ గాఁగీని
వొయ్యారపు రచనలతో వొరపైన చూపులు
వొయ్యనె కన్నులనీట వులికీఁ జూడరే

చ. 3:

కప్పురపుతావితోడ కరఁగేటి తనువు
వొప్పైన కస్తూరిచేత నొరపైనది
యిప్పుడిట్టై తిరువేంకటేశుఁగూడి యింతి
చెప్పరాని వేడుకలఁ జెలఁగీఁ జూడరే