పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0082-3 పాడి సం: 05-303

పల్లవి:

ముద్దులు మోమున ముంచఁగను
నిద్దపుఁ గూరిమి నించీని

చ. 1:

మొల చిరుఘంటలు మువ్వలు గజ్జలు
ఘలఘలమనఁగాఁ గదలఁగను
ఎలనవ్వులతో నీతఁడు వచ్చి
జలజపుచేతులు చాఁచీని

చ. 2:

అచ్చపుఁ గుచ్చుముత్యాల హరములు
పచ్చల చంద్రాభరణములు
తచ్చిన చేతుల తానె దైవమని
అచ్చట నిచ్చట నాడీని

చ. 3:

బాలుఁడు కృష్ణుఁడు పరమపురుషుఁడు
నేలకు నింగికి నెరిఁబొడవై
చాలించి వేంకటాచలపతి దానై
మేలిమిసేఁతల మించీని