పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0082-2 ఆహిరి సం: 05-302

పల్లవి:

మోహంపురతిముదము ముద్దుఁజూపుల మదము
దేహంపు సొబగెల్లఁ దెలిపె సదమదము

చ. 1:

మించుమట్టెల గిలుకు మెరుఁగుగుబ్బల కులుకు
వంచుఁ జూపుల చిలుకు వసివాడుఁ బలుకు
మంచుఁ జెమటల తళుకు మనసు లోపలి యళుకు
అంచుటధరపుబెళుకు అలమేఁటి జళుకు

చ. 2:

కరమూలములఁ గరఁగు కదలుఁ బయ్యెద చెరఁగు
సిరులచెలువపుమొరఁగు చెక్కుపై మరఁగు
గరగరికె తతులెరుఁగు ఘాతలంటిన తెరఁగు
గరిమెతో చెలియునికి కప్పురపుటరఁగు

చ. 3:

కలికితనముల పోగు కమ్మఁదావులవేఁగు
వలపుతమకముల పరవశము పెనుజాగు
కలకంటిబాగు వేంకటపతికిఁ జెలరేఁగు
చెలియ సమరతుల మించిన వింత బాగు