పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0005-3 ముఖారి సం: 05-028

పల్లవి:

ఎక్కడ నున్నదో చిత్తమేమి దలఁచెనో యింతి
చెక్కులెల్లాఁ జెమరించీఁ జెప్పరమ్మా చెలులు

చ. 1:

ఆతని సుద్దులు చెప్పే అతివలే చుట్టాలు
అతనిని వద్దనిన వారందరుఁ బగ
రాతిరెల్లా నిద్దు రెరఁగదు పాదములొత్తి
చేతులెల్లఁ బొక్కెనేమి సేతమమ్మా చెలులు

చ. 2:

నవ్వులు చెక్కులకు గన్నపుగండిదొంగలాయ
నొవ్వులాయ జూపులు కన్నుల మీఁదికి
దవ్వులాయఁ బయ్యద గందపు గుబ్బల మీఁదికి
యెవ్వరి నొల్లదు యిఁకనేఁటికమ్మా చెలులు

చ. 3:

చిత్తమెల్లా దక్కఁగొనె సిగ్గులు ముంగిట వేసె
వత్తివలె దేహమెల్లా వాడఁబారెను
కత్తిఁ గోసినట్లు వేంకటపతి ఘాతలకు
జొత్తు పాపవలె నాయఁ జూడరమ్మా చెలులు