పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0005-2 శంకరాభరణం సం: 05-027

పల్లవి:

పోనీ పోనీలే నీ పొందులేఁటికి నీ-
యాననము చెమరించె నయ్యా నీ యలుకా

చ. 1:

ఆన వెట్టఁగా విచ్చే సేవమ్మపాదాల మీఁదనే
కానీ కానీలే యెక్కడికో నీవు
మానవతితో బింకాలు మానవా యింకాను నీ-
మేనెల్లా బడలెను యేమిటికి నీ యలుక

చ. 2:

బంగారు దుప్పటికొంగు పట్టఁగానే పెనఁగేవు
అంగడి వీధిలో నవులే నీవు
రంగైన సతికోపమెరఁగవా యింకాను నీ-
తొంగలి రెప్పల నీటఁ దోఁచీలే నీ యలుక

చ. 3:

తెరవ నిన్నరగంటఁ దిట్టఁగానే బిగిసేవు
మఱపుఁ దెలివితో మఱియు నీవు
కరఁగి కూడితివి వేంకటగిరి మీఁద నున్న-
నెరజాణ విట్టలుఁడ నేఁడుగా నీయలుక