పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0079-5 బౌళి-ఏకతాళి సం: 05-287

పల్లవి:

ఎవ్వరు గలరమ్మ యిఁక నాకు
నెవ్వగలలోఁ జిత్తము నెలకొన్నదిపుడు

చ. 1:

మనసుకోరిక దీని మానిపెదనంటినా
వొనగూడి మనసు నావొద్దలేదు
పెనఁగి తమకము వా పెదనంటినా మేన
అనయమువెరవు దానై యున్నదిపుడు

చ. 2:

చింత తాలిముల ముంచెదనంటినా మేన
సంతాపములు సేయఁ జలపట్టెను
అంతరంగము నాదియంటివా నెలవున
సంతతమునాతఁడే జట్టిగొనె నిపుడు

చ. 3:

సింగారపుమేను నాచేతికి లోనంటినా
అంగవించి పరవశమై యున్నది
యింగితమెరిఁగి వేంకటేశుఁడు నాకంటినా
కంగి నన్నుఁ గారించి కలసెనిపుడు