పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0077-3 శ్రీరాగం సం: 05-273

పల్లవి:

ఆలవట్టములు వట్టేరవధరించఁ గదో పెద్ద-
పాలిండ్ల బరవున భామ బడలితివి

చ. 1:

మజ్జనమవధరింతు మగువ విచ్చేయవో
గొజ్జంగ కస్తూరినీటఁ గుంకుమనీట
గజ్జల గరుడునిపై కలికి విభునిఁ గూడి
ముజ్జగములఁ దిరిగి మొగినలసితివి

చ. 2:

బోనము వెట్టినారిదె పాలఁతి విచ్చేయవో
ఐనకూరలెల్లఁ జల్లనారీనిదే
తేనెలూరెడి కెమ్మోవితీపులు నీ విభునకుఁ
గానుకగా నిచ్చియిచ్చి కడునలసితివి

చ. 3:

చప్పరమంచముపైకి సరుగ విచ్చేయవో
అప్పఁడు వేంకటరాయఁడలరీ వాఁడే
కొప్పెరగుబ్బలమీఁది కొనగోరిరచనల
కప్పురము మెత్తిమెత్తి కడునలసితివి