పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0077-2 వరాళి సం: 05-272

పల్లవి:

నిండిన వేడుకలెల్ల నీకె గాక
అండనె తాపము చల్ల నమరెగా నాకు

చ. 1:

మగువకన్నుల మొక్కు మట్టెల పాదపుఁ దొక్కు
నిగుడు వాతెరనొక్కు నీకె కాక
అగడునెరుల చిక్కు అరచేతిపై చెక్కు
వగల గుక్కును మిక్కు వన్నెగా నాకు

చ. 2:

తొయ్యలిఁ గూడినరట్టు తుదచెమటల మెట్టు
నెయ్యపుమాటల గుట్టు నీకె కాక
పయ్యద జారినకట్టు భారంపు నొసలిపట్టు
కయ్యపుటలుక తిట్టు గలిగెఁగా నాకు

చ. 3:

మొగలిపువ్వులతావి ముంచినకన్నులకావి
నిగనిగ నగుమోవి నీకె కాక
సగము జారిన నీవి చనవుల నీదేవి-
నగుట వేంకటేశ నేఁడబ్బెఁగా నాకు