పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0077-1 వరాళి సం: 05-271

పల్లవి:

మోపుల చిగురుల చిమ్ముల వేదము
ఆవుల మందలలోని ఆవేదము

చ. 1:

మంచముపైఁ జదివేది మరవకుమీ
కొంచెపు లేఁబలుకుల కొనవేదము
పించెపు శిరసుతోడఁ బిన్ననాఁడే చదివిన
తుంచి తుంచిన మాటల తొలువేదము

చ. 2:

చల్లలమ్మే గొల్లెతల చక్కనిజంకెనలకు
గొల్లపల్లెలోన దొరకొన్న వేదము
తల్లిబిడ్డలనక యందరినొక్కవావిగా
పిల్లఁ గోవి నేరిపిన పెనువేదము

చ. 3:

పంకజభవాదుల బడిబడిఁ జదివించే
లంకెలు చెలఁగిన మేలపువేదము
వేంకటనగముమీఁద వెలయ నిందిరఁగూడి
కొంకక చదివిన చొక్కుల వేదము