పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0075-4 శ్రీరాగం సం: 05-262

పల్లవి:

మరుని నగరిదండ మాయిల్లెఱఁగవా
విరుల తావులు వెల్లవిరిసేటి చోటు

చ. 1:

మఱుఁగు మూఁక చింతల మాయిల్లెఱఁగవా
గుఱుతైన బంగారుకొండల సంది
మఱపు దెలివి యిక్క మాయిల్లెఱఁగవా
వెఱవక మదనుఁడు వేఁటాడేచోటు

చ. 2:

మదనుని వేదంత మాయిల్లెఱఁగవా
చెదరియు జెదరని చిమ్మఁ జీఁకటి
మదిలోన నీవుండేటి మాయిల్లెఱఁగవా
కొదలేక మమతలు కొలువుండేచోటు

చ. 3:

మరులుమ్మెతల తోఁట మాయిల్లెఱఁగవా
తిరువేంకటగిరిదేవుఁడ నీవు
మరుముద్రల వాకిలి మాయిల్లెఱఁగవా
నిరతము నీ సిరులు నించేటిచోటు