పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0074-4 శంకరాభరణం సం: 05-256

పల్లవి:

అప్పఁడు మజ్జనమాడీనంగనఁ గూడి
కుప్పలుఁ దెప్పలుగాఁ గుమ్మరించరో

చ. 1:

బంగారుకొప్పెరల పన్నీరు నించి
రంగైన పచ్చకప్పురపు ధూళొత్తి
చెంగటఁ గస్తూరిధూళి చికిలి గావించి
పొంగారుఁదట్టుపుణుఁగు పోయరో గిన్నెలను

చ. 2:

పటికంపు గాఁగుల పరిమళాలెల్లా
ఘటియించి కుంకుమతోఁ గడు మేదించి
అటునిటు గొజ్జంగనీరందంద నించి
కుటిలకుంతలులు పైఁగుమ్మరించరో

చ. 3:

బలుపింగాణులఁ గదంబము గంధమును
కలపము గావించి గంబూరముతో
వెలయ మజ్జనమాడీ వేంకటాద్రివిభుఁడు
చెలఁగి యింతులు చేరి సేస చల్లరో